DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బక్రీద్ వేడుకలు
News

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బక్రీద్ వేడుకలు

24 May 2026, 09:49 AM   |   Dignity News

నంద్యాల జిల్లా ఇమ్మాముల సంఘం, జమియేతే ఉలేమా హిందూ కీలక నిర్ణయం

నంద్యాల, మే 24 (డిగ్నిటి న్యూస్): రాబోయే పవిత్ర బక్రీద్ పండుగను ప్రభుత్వ నిబంధనలకు లోబడి, అత్యంత ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నంద్యాల జిల్లా ఇమ్మాముల సంఘం, జమియేతే ఉలేమా హిందూ పిలుపునిచ్చాయి. స్థానిక కుబ్రా మసీదులో అంజాద్ బాషా సిదికి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముస్లిం మత పెద్దల ముఖ్య సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. పండుగ రోజున నిర్ణీత సమయానికి ఈద్గాలు, మసీదులకు చేరుకుని నమాజ్ పూర్తి చేయాలని, అనంతరం జరిగే పవిత్ర కుర్బానీలో కేవలం పొట్టేళ్లను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. చట్టాలను గౌరవిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవులను వధించకూడదని, ఒకవేళ ప్రభుత్వం ఆవును ‘జాతీయ జంతువు’గా ప్రకటిస్తే తామంతా పూర్తి మద్దతు ఇస్తామని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కుర్బానీ అనంతరం పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మౌలానా మహబూబ్ బాషా, హఫీజ్ అబ్దుల్సలాం, మౌల్వి అబ్దుల్ రావూఫ్, హఫీజ్ అబ్దుల్ రజాక్, అబ్దుల్ రహమాన్, హాఫీజ్ అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.