DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
నైపుణ్యాభివృద్ధి శిక్షణలతోనే యువతకు ఉపాధి- జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
News

నైపుణ్యాభివృద్ధి శిక్షణలతోనే యువతకు ఉపాధి- జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

23 May 2026, 01:56 PM   |   Dignity News

నల్లగొండ, మే 23 (డిగ్నిటీ న్యూస్): యువత స్వయంశక్తితో సొంత కాళ్లపై నిలబడేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి శిక్షణలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం ఉదయాదిత్య భవన్ లో నిర్వహించిన యువజన వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కప్ క్రీడలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు, జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన యువతకు నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారే దేశానికి అత్యంత కీలకమైన వనరు అని పేర్కొన్నారు. యువతలో ఫిట్‌నెస్ పెంచేందుకు ప్రభుత్వం ‘ఫిట్ తెలంగాణ’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. నల్లగొండలో ఏర్పాటు చేసిన న్యాక్, సెట్విన్, ఇందిరా మహిళా శక్తి కేంద్రాల ద్వారా యువతకు కెరీర్, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతకు ఎంఎస్‌ఎంఈ ద్వారా రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.యువత సమాజ అవసరాలను గుర్తిస్తూ నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని, ముఖ్యంగా జీవితంలో ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.

మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, చాటింగ్‌లకు పరిమితమై సమయాన్ని వృథా చేసుకోకుండా లక్ష్యసాధనపైనే దృష్టి పెట్టాలన్నారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.అనంతరం సీఎం కప్‌ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన హాకీ జట్టుతో పాటు కిక్ బాక్సింగ్, అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్‌బాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, అదనపు ఎస్పీ రమేష్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ, కోచ్ శంభులింగం, పలువురు శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

📰
Chintha YadaiahReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.