DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
స్వయం ఉపాధితో ఎస్సీ కుటుంబాల అభివృద్ధి లక్ష్యం
News

స్వయం ఉపాధితో ఎస్సీ కుటుంబాల అభివృద్ధి లక్ష్యం

20 May 2026, 01:15 PM   |   Dignity News

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): ఎస్సీ కుటుంబాల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం లక్ష్యంగా 2025-26 ఆర్థిక సంవత్సర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో బుధవారం జాయింట్ ఐడెంటిఫికేషన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర పాల్గొని ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాల ప్రాముఖ్యతను వివరించారు. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్‌లకు మొత్తం 47 యూనిట్లు మంజూరు కాగా, వాటికి సంబంధించి 442 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈవీ టూ వీలర్లు, ఈవీ త్రీ వీలర్లు, పాడి పశువులు, సోలార్ పంపుల పథకాల కింద దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల అర్హతలు, ఆర్థిక పరిస్థితులను పరిశీలించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. బ్యాంకు రుణాలు, కార్పొరేషన్ సబ్సిడీలతో లబ్ధిదారులకు ఉపాధి అవకాశాలు కల్పించి కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకుల అధికారులు, షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ అధికారులు, టీఎంసీ శ్రీనివాస్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.

📰
Chintha YadaiahReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.