DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
జనగణనలో ఎన్యూమరేటర్లకు సహకరించాలి: కమిషనర్
News

జనగణనలో ఎన్యూమరేటర్లకు సహకరించాలి: కమిషనర్

10 May 2026, 01:33 PM   |   Dignity News

కర్నూలు, మే 10 (డిగ్నిటి న్యూస్): నగర పరిధిలో చేపడుతున్న తొలి విడత ఇంటిగణనలో భాగంగా ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు పూర్తిస్థాయిలో సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. ఆదివారం ఆయన కింగ్ మార్కెట్, ఖండేరి వీధి ప్రాంతాల్లో జరుగుతున్న గణన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలే ప్రాధాన్యత వహిస్తాయని పేర్కొన్నారు.నగరంలో ప్రస్తుతం 911 మంది ఎన్యూమరేటర్లు, 151 మంది సూపర్వైజర్లు ఈ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని, ఇప్పటివరకు 35.07 శాతం గణన పూర్తి చేసి జిల్లాలోనే ముందంజలో ఉన్నామని కమిషనర్ వెల్లడించారు. మే 31వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని వివరించారు. ఎన్యూమరేటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ సంఖ్య గానీ, ఓటీపీలు, బ్యాంకు వివరాలు అడగరని, ప్రజలు కేవలం అడిగిన ప్రాథమిక వివరాలు మాత్రమే అందజేయాలని స్పష్టం చేశారు. సిబ్బంది తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించి వస్తారని, ప్రజలు వాటిని పరిశీలించి బాధ్యతగా వివరాలు నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.