DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
నల్లబెల్లిలో ఓంకార్ శతజయంతి సభ పోస్టర్ల ఆవిష్కరణ
Political

నల్లబెల్లిలో ఓంకార్ శతజయంతి సభ పోస్టర్ల ఆవిష్కరణ

09 May 2026, 05:01 PM   |   Dignity News

నల్లబెల్లి, మే 9 (డిగ్నిటి న్యూస్): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ‘అసెంబ్లీ టైగర్’ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శతజయంతి ఉత్సవాల ముగింపు సభను విజయవంతం చేయాలని ఎంసీపీఐ(యు) మండల కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలో సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆ పార్టీ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి దామ సాంబయ్య, సహాయ కార్యదర్శి మార్తా నాగరాజు మాట్లాడుతూ వచ్చే మంగళవారం (మే 12న) సాయంత్రం 4 గంటలకు నర్సంపేటలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో ఈ ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఓంకార్ గారు ఐదు దశాబ్దాల పాటు చట్టసభల్లో ప్రజా గొంతుకగా నిలిచారని, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని చాటిన ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. నల్లబెల్లి మండలం నుంచి రైతులు, కార్మికులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభను జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకురాలు మార్తా సుధ, కనకం కోర్నల్, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.