DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
ధాన్యం అన్లోడింగ్‌ వేగవంతం చేయాలి: పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర
News

ధాన్యం అన్లోడింగ్‌ వేగవంతం చేయాలి: పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర

05 May 2026, 12:17 PM   |   Dignity News

చిట్యాల, మే 5 (డిగ్నిటి న్యూస్): రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద అన్లోడింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ, ట్రక్కు షీట్లు, హమాలీల లభ్యత, వాహనాల రాకపోకలపై జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పెద్దకాపర్తి కేంద్రానికి ఇప్పటివరకు 25 వేల క్వింటాళ్ల ధాన్యం రాగా, అందులో 7,000 క్వింటాళ్ల కొనుగోలు పూర్తి చేశామని, మరో 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉందని అధికారులు కమిషనర్‌కు వివరించారు.కొనుగోలు కేంద్రాల్లో ట్యాబ్‌ ఎంట్రీ ప్రక్రియ వంద శాతం పూర్తి కావాలని, ఎక్కడా పెండింగ్‌ ఉండకూడదని కమిషనర్‌ స్పష్టం చేశారు. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా అదనపు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని, మిల్లుల వద్ద స్థలం లేని పక్షంలో ధాన్యాన్ని ఇంటర్మీడియట్‌ గోడౌన్లకు తరలించాలని సూచించారు. ఇందుకోసం అదనపు లారీలను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం వట్టిమర్తిలోని సిద్ధార్థ రైస్ ఇండస్ట్రీని సందర్శించిన ఆయన, వాహనాల రొటేషన్ పెంచుతూ అన్లోడింగ్‌ వేగంగా జరిగేలా చూడాలన్నారు. ఈ తనిఖీల్లో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ రోహిత్ సింగ్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

📰
Chintha YadaiahReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.