DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
ఆడపిల్లలను పుట్టనిద్దాం.. చదవనిద్దాం.. బ్రతకనిద్దాం
Uncategorized

ఆడపిల్లలను పుట్టనిద్దాం.. చదవనిద్దాం.. బ్రతకనిద్దాం

11 Oct 2026, 11:22 AM   |   Dignity News

నంద్యాల, అక్టోబర్ 11 (డిగ్నిటి న్యూస్): అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డిఎంహెచ్ఓ) డాక్టర్ శారదా బాయి ఆధ్వర్యంలో ఆదివారం వైద్య సిబ్బంది, ఆర్.ఆర్. నర్సింగ్ విద్యార్థులతో సమావేశం మరియు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదా బాయి మాట్లాడుతూ.. ఆడపిల్లలను సమాజంలో మగబిడ్డలతో సమానంగా చూడాలని, వారిని బ్రతకనిచ్చి ఉన్నత చదువులు చదివించాలని పిలుపునిచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, చెప్పడం పిసిపిఎండిటి చట్టం 1994 ప్రకారం తీవ్ర నేరమని, శిక్షార్హులవుతారని హెచ్చరించారు. బాలికల హక్కులు, ఆరోగ్య విద్య, రక్షణ చట్టాలపై సమాజంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికలు తీవ్ర ఆరోగ్య, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, బాలికా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫిల్మ్ షో పోటీల విజేతలకు సోమవారం పీజీఆర్‌ఎస్ (PGRS) భవనంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ ఓ. లలిత, సూపరింటెండెంట్ డాక్టర్ చిట్టిబాబు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ జగదీశ్ చంద్రారెడ్డి, డాక్టర్ కాంతారావు నాయక్, డెమో మల్లేపల్లి పామన్న మరియు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.