DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి: వామపక్షాల డిమాండ్
Uncategorized

కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి: వామపక్షాల డిమాండ్

10 Oct 2026, 11:27 AM   |   Dignity News

నంద్యాల: కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇసి) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నంద్యాలలో శనివారం వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యాలయం నుండి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా సాయిబాబా నగర్ వరకు సీఈసీ శవయాత్ర నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. నాగరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్ మాట్లాడుతూ.. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల 80 లక్షల ఓట్లను ఏకపక్షంగా తొలగించారని మండిపడ్డారు. ముఖ్యంగా బిజెపికి వ్యతిరేకంగా ఉండే వర్గాలు, మైనారిటీలు, ప్రతిపక్షాల ఓట్లను తొలగించడంలో సీఈసీ ప్రధాన పాత్ర పోషించారని విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, తొలగించిన ఓటర్లకు తిరిగి ఓటు హక్కు పునరుద్ధరించాలని, ఎన్నికల కమిషన్ నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న యువజనులను, విద్యార్థులను అరెస్టు చేయడం దుర్మార్గమని, రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు కే మహమ్మద్ గౌస్, తోట మద్దులు, వెంకట లింగం, వెన్న బాలవెంకట్, ఎమ్మార్ నాయక్, సురేష్, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.