- కొలిమిగుండ్ల ఎస్ఐ షేక్ నగీనా హెచ్చరిక
- కిరాణా షాపుల్లో తనిఖీలు.. విక్రయిస్తే కఠిన చర్యలు
కొలిమిగుండ్ల, సెప్టెంబర్ 28 (డిగ్నిటి న్యూస్): ఇంటి వాకిట చల్లే ‘సౌభాగ్య పౌడర్’ (పేడ పౌడర్) అమ్మకకాలపై కొలిమిగుండ్ల పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పౌడర్‌ను ఎవరైనా అమ్మినా, వాడినా వారిపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ షేక్ నగీనా హెచ్చరించారు. కొలిమిగుండ్ల పట్టణంలో వివిధ కిరాణా, పెట్టీ షాపుల్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం, షాపుల యజమానులతో మాట్లాడి పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ — “సౌభాగ్య పౌడర్ విక్రయాలపై జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి స్పష్టమైన నిషేధాజ్ఞలు, కఠిన ఆదేశాలు ఉన్నాయి. కిరాణా, పెట్టీ షాపుల యజమానులు తమ వద్ద ఉన్న సౌభాగ్య పౌడర్ నిల్వలను వెంటనే నాశనం చేయాలి లేదా స్వచ్ఛందంగా తెచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలి.అలా కాకుండా, పోలీసుల తనిఖీల్లోగానీ, రెవెన్యూ లేదా ఇతర అధికారుల ఆకస్మిక తనిఖీల్లోగానీ ఈ పౌడర్ లభ్యమైతే షాపు యజమానులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తాం. ఈ మధ్యకాలంలో క్షణికావేశానికి లోనై, సులువుగా లభించే ఈ పౌడర్‌ను తీసుకుని పలువురు మహిళలు, ఇతరులు మరణాలకు గురవుతున్నారు. సౌభాగ్య పౌడర్ తిని ఎవరైనా మృతి చెందితే.. ఆ పౌడర్ విక్రయించిన షాపు యజమానిని కూడా బాధ్యుడిని చేస్తూ వారిపై కూడా కేసు నమోదు చేస్తాం” అని స్పష్టం చేశారు.కాబట్టి కొలిమిగుండ్ల మండల వ్యాప్తంగా ఎక్కడా కూడా ఈ పౌడర్‌ను అమ్మకూడదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని షాపుల యజమానులకు గట్టిగా హెచ్చరించారు.
