DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
వ్యక్తిగత దూషణలు మాని ప్రజా సమస్యలపై మాట్లాడాలి
Political

వ్యక్తిగత దూషణలు మాని ప్రజా సమస్యలపై మాట్లాడాలి

18 Jul 2026, 09:49 AM   |   Dignity News
  • కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలి
  • ఎమ్మిగనూరు వైఎస్ఆర్‌సీపీ పట్టణ నాయకుల డిమాండ్

ఎమ్మిగనూరు, జూలై 18 (డిగ్నిటి న్యూస్): రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మాని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత వారం రోజులుగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు వైఎస్ఆర్‌సీపీ నాయకులపై అనుచిత, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.ప్రజలకు చేయాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమవడం వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో అన్ని సామాజిక వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరాయని, ప్రతిపక్ష పార్టీల కుటుంబాలకు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి హయాంలో సంక్షేమ నిధులు నేరుగా జమయ్యాయని గుర్తు చేశారు.కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు ఎంత మేరకు అమలు చేశారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొత్త పెన్షన్ల మంజూరులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి తప్పు చేశామని ప్రజల్లో చర్చ జరుగుతోందని వ్యాఖ్యానించారు.

నియోజకవర్గ ఇన్‌చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ప్రారంభించిన “నమస్తే ఎమ్మిగనూరు – ప్రజా సమస్యలపై పోరు” కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఈ భయంతోనే వైఎస్ఆర్‌సీపీ నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను వెంటనే పారదర్శకంగా అమలు చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ రియాజ్ అహ్మద్, జిల్లా అధికార ప్రతినిధి కదిరి కోట సునీల్ కుమార్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వెంకటాపురం రాజు, మాజీ స్టోర్ చైర్మన్ షాబ్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ షాబుద్దీన్, వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు కె.ఆర్. నటరాజ్ రెడ్డి, వార్డు ఇన్‌చార్జిలు డిష్ కేశవరెడ్డి, వడ్డే వీరేష్, బంగి శ్రీరామ్, రాళ్లదొడ్డి చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.