DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
బాబోయ్‌.. దొంగలు!
News

బాబోయ్‌.. దొంగలు!

30 Jun 2026, 12:00 PM   |   Dignity News
  • రైతునగర్‌ శ్రీసాయినగర్‌ వెంచర్‌లో అర్ధరాత్రి కంగారూ…
  • గ్యాంగ్‌ హల్‌చల్‌.. తాళం వేసిన ఇంట్లో చొరబడి బీభత్సం..
  • సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు..
  • భయాందోళనలో కాలనీవాసులు!

నంద్యాల, జూన్ 30 (డిగ్నిటి న్యూస్): నంద్యాల పట్టణంలోని రైతునగర్‌ సమీపంలోని శ్రీసాయినగర్‌ వెంచర్‌లో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఒక ముఠా ముఖాలకు ముసుగులు ధరించి ప్రధాన ద్వారం గుండా కాలనీలోకి ప్రవేశించింది. ఆపై కాలనీ వీధుల్లో దాదాపు అరగంట పాటు యథేచ్ఛగా సంచరిస్తూ అనుకూలమైన ఇళ్ల కోసం వేట సాగించింది. ఈ క్రమంలోనే ఒక వీధిలో తాళం వేసి ఉన్న ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు, ప్రధాన తలుపులను బద్దలు కొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగల ముఠా గదులన్నింటినీ జల్లెడ పట్టినట్లు సమాచారం. అల్మారాల్లో ఉన్న బట్టలను, వస్తువులను కిందపడేసి విలువైన సొత్తు కోసం క్షుణ్ణంగా శోధించినట్లు సమాచారం. అయితే ఆ ఇంటి యజమాని వస్తే కానీ ఆ ఇంట్లో ఏం పోయాయో తెలియాల్సి ఉంది.

దుండగుల కదలికలన్నీ కాలనీలోని ఓ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.ఈ సంఘటనతో శ్రీసాయినగర్‌ వెంచర్‌ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అర్ధరాత్రి వేళ ముసుగు దొంగలు కాలనీలో పగటిపూటలా తిరగడం స్థానికులను తీవ్రంగా కలవరపెడుతోంది. కాలనీవాసులంతా రాత్రి సమయాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకు సురక్షితమైన తాళాలు వేసుకోవాలని స్థానిక పెద్దలు కోరుతున్నారు. కాగా, ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి, కాలనీలో రాత్రి పూట గస్తీని ముమ్మరం చేయాలని, ఆ ముసుగు దొంగలను వీలైనంత త్వరగా పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.