DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
నంద్యాల హోటల్‌పై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఆకస్మిక తనిఖీ!
News

నంద్యాల హోటల్‌పై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఆకస్మిక తనిఖీ!

28 Jun 2026, 12:26 PM   |   Dignity News
  • చికెన్‌లో బొద్దింక కలకలం.. శాంపిల్స్ సేకరించి చెన్నై ల్యాబ్‌కు పంపిన అధికారులు

నంద్యాల, జూన్ 28 డిగ్నిటి (న్యూస్): నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్‌లో ఉన్న ‘క్లాసిక్ బిర్యానీ హౌస్’ హోటల్‌లో విక్రయించిన చికెన్ రోస్ట్‌లో బొద్దింక కనిపించిందనే అంశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ఫిర్యాదులు, మీడియా కథనాల ఆధారంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ సదరు హోటల్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో భాగంగా హోటల్‌లోని వంటగది, ఆహార పదార్థాల నిల్వ విధానం, వంట నాణ్యత, లైసెన్స్‌లు మరియు ఫుడ్ సేఫ్టీ నిబంధనల అమలును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.అక్కడ ఉన్న లోటుపాట్లను గుర్తించిన అధికారులు హోటల్ యాజమాన్యానికి పలు సూచనలు చేస్తూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశిస్తూ ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీ చేశారు. దీనిపై స్పందించేందుకు వారికి 15 రోజుల సమయం ఇచ్చారు. అంతేకాకుండా, హోటల్‌లో తయారు చేసిన చికెన్ దమ్ బిర్యానీ నమూనాలను శాంపిల్స్‌గా సేకరించి తదుపరి పరీక్షల నిమిత్తం చెన్నైలోని లాబొరేటరీకి పంపించారు.

ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే హోటల్ యాజమాన్యంపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు కూడా ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు హోటళ్లలో పరిశుభ్రతను గమనించాలని, ఎక్కడైనా నిబంధనలు పాటించకపోతే తమకు సమాచారం అందించాలని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సూచించారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.