DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
డ్రగ్స్ వద్దు.. చదువులే ముద్దు
News

డ్రగ్స్ వద్దు.. చదువులే ముద్దు

24 Jun 2026, 01:51 PM   |   Dignity News
  • జెడ్‌పీ పాఠశాలలో ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ సదస్సు
  • విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎన్‌సీఆర్‌సీ ప్రతినిధులు

గాజువాక/విశాఖపట్నం, జూన్ 24 (డిగ్నిటి న్యూస్): విద్యార్థులు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండి, విద్యాభ్యాసంపైనే దృష్టి సారించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ (ఎన్‌సీఆర్‌సీ) ప్రతినిధులు పిలుపునిచ్చారు. గాజువాక కాంతి రోడ్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల ఆధ్వర్యంలో ‘నశా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్‌సీఆర్‌సీ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్‌సీఆర్‌సీ జాతీయ కోర్ కమిటీ మీడియా చైర్మన్ మొల్లి కమల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ బళ్ల శ్రీనివాస్, రాష్ట్ర చైర్మన్ అబ్జర్వర్ అట్టాడ అవినాష్, రాష్ట్ర సహా కార్యదర్శి సి. కిరణ్, రాష్ట్ర వైస్ చైర్మన్ ఎన్. ప్రసాద్ ప్రసంగించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, చదువులో వెనుకబాటుతో పాటు కుటుంబాల్లో తీరని సమస్యలు తలెత్తుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా విద్యార్థి దశలో చెడు అలవాట్లకు లోనుకాకుండా లక్ష్య సాధన వైపు అడుగులు వేయాలని వక్తలు సూచించారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం, చెడు స్నేహాల వల్లే యువత ఎక్కువగా మత్తు పదార్థాల బారిన పడే ప్రమాదం ఉందని, అటువంటి పరిస్థితుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, పుస్తక పఠనం, సృజనాత్మక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకోవడం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవచ్చని వివరించారు. సమాజంలో మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎన్‌సీఆర్‌సీ ప్రతినిధులకు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.