DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
చెరువుగట్టులో పోటెత్తిన భక్తజనం
News

చెరువుగట్టులో పోటెత్తిన భక్తజనం

14 Jun 2026, 07:17 PM   |   Dignity News

శివనామ స్మరణతో మారుమోగిన జడల రామలింగేశ్వర స్వామి ఆలయం

నల్లగొండ, జూన్ 15 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. వేకువజాము నుంచే ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమావాస్య రోజున స్వామివారిని దర్శించుకుంటే అరిష్టాలు తొలగి, కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.పలువురు భక్తులు శనివారం రాత్రి నుంచే కొండపైకి చేరుకుని జాగరణ చేస్తూ స్వామివారి దర్శనం కోసం వేచి చూశారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణమంతా “ఓం నమః శివాయ” పంచాక్షరి మంత్రంతో మారుమోగి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, అర్చక బృందం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి, దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.