DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
ఆకుమల్లలో వైభవంగా పెద్దమ్మ దేవర
Devotional

ఆకుమల్లలో వైభవంగా పెద్దమ్మ దేవర

07 Jun 2026, 12:09 PM   |   Dignity News

అమ్మవారిని దర్శించుకున్న మంత్రి బి.సి.జనార్ధనరెడ్డి సతీమణి ఇందిరమ్మ.. పోటెత్తిన భక్తులు

సంజామల, జూన్ 7 (డిగ్నిటి న్యూస్): మండల పరిధిలోని ఆకుమల్ల గ్రామంలో పెద్దమ్మదేవర ఉత్సవాలు భక్తుల కోలాహలం మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. శనివారం రాత్రి అమ్మవారి విగ్రహాన్ని భక్తుల జయజయధ్వానాల నడుమ గ్రామోత్సవం నిర్వహించి, అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై కొలువుదీర్చారు.

ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి, అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అలంకరణలు చేపట్టారు. ఆదివారం ఉదయం గ్రామంలోని మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రతి ఇంటా బోనాలను సిద్ధం చేసుకుని, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కానుకలు, కొబ్బరికాయలు, కర్పూర హారతులు ఇచ్చి తమ భక్తిని చాటుకున్నారు.ఈ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర మంత్రి బి.సి.జనార్ధనరెడ్డి సతీమణి బి.సి.ఇందిరమ్మ ఆకుమల్ల గ్రామానికి చేరుకుని పెద్దమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల సీనియర్ నాయకులు ఎం.మద్దిలేటి రెడ్డి, కె.రమణారెడ్డి, మహేశ్వర రెడ్డి, తిమ్మయ్యలతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

📰
Chinna MadduletyReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.