DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
నగరాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి
News

నగరాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి

06 Jun 2026, 10:14 AM   |   Dignity News

మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర

నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో శనివారం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ రెండో విడత వార్డు సభలు విజయవంతంగా జరిగాయి. డివిజన్ నెంబర్ 15, 16లలో నిర్వహించిన సభలకు మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర స్వయంగా హాజరై ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం ప్రతి ఇంటా తడి, పొడి, శానిటరీ, హానికర చెత్తను వేర్వేరుగా మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, మురుగు కాలువల్లో చెత్త వేయకుండా పారిశుధ్యానికి సహకరించాలని కోరారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. సభలలో తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, రహదారులపై ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే వార్డు సభల్లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, వార్డు సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

📰
Chintha YadaiahReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.