- వ్యాపారులు, వాహనదారులను దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్
- పోలీసుల జోక్యానికి ఐకాసా నాయకుల డిమాండ్
ఆళ్లగడ్డ, జూన్ 24 (డిగ్నిటి న్యూస్): ఆళ్లగడ్డ పట్టణంలో హిజ్రాల ఆగడాలతో వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, వారి వేధింపులను తక్షణమే అరికట్టాలని జాయింట్ యాక్షన్ కమిటీ (ఐకాసా) నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని టీబీ రోడ్డులోని ప్రధాన రహదారిలో ఉన్న దుకాణాల వద్దకు నిత్యం ఎవరో ఒకరు హిజ్రాలు వస్తూ, దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఐకాసా కన్వీనర్ బీరువాల భాష, మాలల సంక్షేమం మరియు అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అడిగినంత ఇవ్వని వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, అంగాంగ ప్రదర్శనలు చేస్తూ దుకాణదారులను బెంబేలెత్తిస్తున్నారని మండిపడ్డారు. పట్టణ శివారుల్లోని మలుపుల వద్ద మాటు వేసి ద్విచక్ర వాహనాలు, ఆటోలను ఆపి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని, వ్యాపారాలు చేసుకోవాలంటే రౌడీలు, గుండాలను మించి వీరికి నజరానాలు ఇచ్చుకోవాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు.స్థానిక పోలీసు యంత్రాంగం స్పందించి హిజ్రాల ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారు పట్టణంలోనికి ప్రవేశించకుండా తగిన ఆంక్షలు విధించాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకాసా సభ్యులు హుస్సేన్ భాష, వలి భాషతో పాటు మాలల సంక్షేమం మరియు అభివృద్ధి సంఘం ప్రతినిధులు, స్థానిక వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
