- టైరు పేలడంతో అదుపుతప్పిన వాహనం.. ఎస్బీ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
- శాంతిరాం ఆసుపత్రికి తరలింపు.. పాణ్యం పోలీసుల కేసు నమోదు
పాణ్యం, జూలై 5 డిగ్నిటి న్యూస్: నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో సహాయ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)గా విధులు నిర్వహిస్తున్న సురేష్ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కర్నూలు నుంచి నంద్యాల వైపునకు కారులో వస్తుండగా తమ్మరాజుపల్లె సమీపంలో అకస్మాత్తుగా కారు టైరు పేలిపోవడంతో (బరస్ట్) ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం.. ఏఎస్ఐ సురేష్ రెడ్డి మరో కానిస్టేబుల్‌తో కలిసి కారులో కర్నూలు నుంచి నంద్యాల వైపు బయలుదేరారు. వాహనం తమ్మరాజుపల్లె గ్రామ పరిసరాల్లోకి రాగానే కారు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
ఈ ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న ఏఎస్ఐ సురేష్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఆయన పాణ్యం పోలీస్ స్టేషన్లోనే విధులు నిర్వహించి ఉండటంతో ఇక్కడి సిబ్బంది, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్) కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పాణ్యం పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన కానిస్టేబుల్‌ను పోలీసులు దగ్గరుండి చికిత్స నిమిత్తం నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆసుపత్రికి తరలించారు. సురేష్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. తోటి అధికారి మృతితో పోలీస్ శాఖలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
