RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

శ్రీశైలం సేవలన్నీ ఆన్‌లైన్లోనే.. ‘మనమిత్ర’తో సులభతరం

శ్రీశైలం, మే 10: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం, వసతి, ఆర్జిత సేవల టికెట్ల కోసం భక్తులు కేవలం అధికారిక వెబ్‌సైట్లనే ఆశ్రయించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు. భక్తులకు పౌర సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా కూడా శ్రీశైల క్షేత్రానికి సంబంధించిన టికెట్లు పొందే వెసులుబాటు ఉందని ఆయన వివరించారు.ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా స్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాలతో పాటు గర్భాలయ అభిషేకం, చండీహోమం, కల్యాణోత్సవం వంటి 17 రకాల ఆర్జిత సేవలను భక్తులు పారదర్శకంగా బుక్ చేసుకోవచ్చని ఈవో తెలిపారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ల కోసం దేవదాయ శాఖ వెబ్‌సైట్ www.aptemples.ap.gov.in లేదా దేవస్థానం పోర్టల్ www.srisailadevasthanam.org మాత్రమే వాడాలని సూచించారు. క్షేత్ర పరిధిలోని 8 ప్రాంతాల్లో ఇప్పటికే కియోస్క్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, త్వరలో మరో 12 చోట్ల వీటిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.టికెట్ల బుకింగ్ సమయంలో ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా వ్యక్తిగత ఖాతాలకు నగదు పంపాలని ఎవరైనా కోరితే అది సైబర్ నేరంగా గుర్తించి అప్రమత్తంగా ఉండాలని భక్తులను హెచ్చరించారు. నకిలీ వెబ్‌సైట్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరుతూ, ఏవైనా సందేహాలుంటే దేవస్థానం సమాచార కేంద్రం నంబర్లు 8333901351, 52, 53లను సంప్రదించాలని ఈవో సూచించారు.

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version